Komurelli mallannaku ‘new’ threat- ఆంధ్రజ్యోతి

12-12-2016

కొమురెల్లి మల్లన్నకు ‘కొత్త’ ముప్పు

కొమురెల్లి మల్లన్న.. ఈ పేరు చెప్పగానే.. కోర మీసం.. పెద్ద కళ్లు.. నీలమేఘ ఛాయతో బండల నడుమ కొలువుదీరిన సుందర రూపుడు గుర్తొస్తాడు. 800 ఏళ్ల కిందట పుట్ట మన్నుతో స్వయంభువుగా వెలసిన వరాల దేవుడు! ఆ తేజోమూర్తిని కోట్లాది మంది ఇలవేల్పుగా కొలుస్తారు! కోరిన కోర్కెలు తీర్చే ఆ కొంగు బంగారుకే పెద్ద కష్టం వచ్చింది. స్వయంభూ శివలింగంపై రూపుదిద్దుకున్న ఆ మహిమాన్విత విగ్రహాన్ని తొలగించి, గ్రానైట్‌ విగ్రహం పెడతానని స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ప్రకటించారు. ఒకసారి రెండుసార్లు కాదు.. ప్రతీ అధికారిక సమావేశంలోనూ ఆయన ఇవే ప్రకటనలు చేస్తున్నారు. ఇటీవల మల్లన్న బ్రహ్మోత్సవాల సమీక్ష సమావేశంలోనూ, తాజాగా మరో సందర్భంలో కూడా గ్రానైట్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసే యోచన ఉన్నట్లు ఆయన ప్రకటించారు. ఆయన ప్రకటనలు అధికారులు, అర్చకులు అందరికీ అపచారంగా తోస్తున్నా.. అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో మౌనం దాలుస్తున్నారు. ఈనెల 25 నుంచి మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్న సమయంలో.. త్వరలో కొమురెల్లి జాతర మొదలవుతున్న తరుణంలో ఎమ్మెల్యే ప్రకటనలు స్థానికంగా పెను దుమారం రేపుతున్నాయి. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న ఈ నిర్ణయంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 

కోటి కాంతుల మల్లన్న విగ్రహం

దర్శించగానే రెండు చేతులెత్తి దండం పెట్టేలా కనిపించే కొమురెల్లి మల్లన్న విగ్రహానికి దాదాపు 800 సంవత్సరాల చరిత్ర ఉంది. పరమేశ్వరుడి అనుగ్రహం కోసం కొమురెల్లిలో ఒక మునీశ్వరుడు ఆచరించిన తపస్సుకు శివుడు ప్రత్యక్షమయ్యాడనే ప్రశస్తి ఉంది. చిన్నస్థాయి శివలింగం ఆకారంలో శివుడు కొలువుదీరడంతో ఆ మునీశ్వరుడు తపస్సు విరమించాడని చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత శివలింగం చుట్టూరాపెద్ద పుట్ట మొలిచింది. ఆ పుట్ట మట్టితోనే మహాశివుడి అవతార స్వరూపుడైన మల్లికార్జునుడి విగ్రహాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. మల్లికార్జునుడి నాభి ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్టించారనే విషయం ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉంది. ఎనిమిది శతాబ్దాలుగా చెక్కు చెదరకుండా ఉన్న మల్లన్న విగ్రహానికి ఏటా కల్యాణ సమయంలో అలంకరణ చేస్తున్నారు. దీంతో ఏడాదంతా మల్లన్న విగ్రహం శోభాయమానంగా విరాజిల్లుతుంది. బండల నడుమ కొలువుదీరిన మల్లన్న గర్భగుడి ఇప్పటికీ పటిష్ఠంగానే కనిపిస్తోంది. తెలుగు రాష్ర్టాల ప్రజలతోపాటు ఇతర రాష్ర్టాల భక్తుల కొంగు బంగారంగా నిలుస్తున్న మల్లన్న విగ్రహ మార్పునకు చర్చను లేవనెత్తినజనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వ్యాఖ్యలు స్థానికంగా దుమారాన్ని రేపుతున్నాయి. 800 ఏళ్ల క్రితమే పుట్టమన్నుతో కొలువై.. ఇప్పటికీ పటిష్ఠంగా చెక్కు చెదరకుండా ఉన్న మల్లన్న విగ్రహాన్ని ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని నిలదీస్తున్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలపై ఆలయ అధికారులు, అర్చకులు స్పందించక పోవడం విడ్డూరం అంటున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేనే సమీక్ష సమావేశంలో, మరో సందర్భంలో చర్చించడంతో వారు మిన్నకుండిపోయారు.

సీఎంకు చెప్పా : ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

కొమురెల్లిలో 800 ఏళ్లనాటి పుట్ట మన్ను విగ్రహం ఉంది. దాని స్థానంలో కొత్తగా ఇప్పుడు రాతి విగ్రహం ఏర్పాటు చేసే యోచన ఉంది. దీనిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాను.

ఈనెల 25 నుంచే బ్రహ్మోత్సవాలు

ఈనెల 25న మల్లన్న కల్యాణ వేడుకలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. లక్షల మంది భక్తులు మల్లన్నను దర్శించుకుంటారు. వాస్తవానికి స్వయంభూ, మూల విరాట్‌ చారిత్రక నేపథ్యం ఉన్నందునే భక్తుల మదిలో మల్లికార్జున స్వామి ప్రత్యేక స్థానం సంపాదించాడు. ఇప్పుడు ఆ మూల విరాట్‌నే తొలగించి రాతి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఒనగూరే ప్రయోజనాలేమిటో ఆ పెద్దలకే తెలియాలని భక్తులు అంటున్నారు. స్వయంభూ, మూలవిరాట్‌ల నేపథ్యం ఉన్నందునే అమర్‌నాథ్‌, తిరుపతి, వేములవాడ, శ్రీశైలం, ఏడుపాయల, ధర్మపురి, భద్రాచలం, బాసర లాంటి దేవాలయాలు భక్తుల మనసుల్లో వెలుగొందుతున్నాయి. మంచుతో కొలువుదీరిన అమరనాథ్‌ మహాశివుడికి లేని ముప్పు పుట్టమన్నుతో కొలువైన కొమురెల్లి మల్లన్నకే వచ్చిందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికైనా భక్తుల మనోభాలను కించపరిచే నిర్ణయాలను అమలు చేయవద్దని, ఇలాగైతే బ్రహోత్సవాలపై, ఆలయ ప్రాశస్త్యం ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.

 

Leave a Reply