భక్తుల సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తాం –  టిటిడి ఛైర్మన్‌ శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌

తిరుమల,11మే2018

తిరుమల  శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు విచ్చేసే భక్తులకు సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తామని టిటిడి ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ అన్నారు.  శుక్రవారం సాయంత్రం టిటిడి ఛైర్మన్‌, అధికారులతో కలిసి తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ 2, నందకం విశ్రాంతి భవనంలోని మిని కళ్యాణకట్టలు, హిల్‌వ్యూ కాటేజీలలోని గదులను పరిశీలించారు.


ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్‌ మీడియాతో మాట్లాడుతూ భక్తులకు మరింత మెరుగ్గా సౌకర్యాలను కల్పిస్తామన్నారు. విక్యూసీ 2లోని కంపార్ట్‌మెంట్లలో ఫ్యాన్‌ల స్విచ్‌ ఆఫ్‌ బోర్డులు ఒకేచోట అమర్చాలని, భక్తులకు మరింత భద్రతను పెంచేందుకు సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని,  లిఫ్ట్‌ మరమ్మత్తులు చేపట్టి తగినంతమంది సిబ్బందిని నియమిస్తామన్నారు. భక్తులకు వైద్య సౌకర్యాలను మరింత మెరుగు పరచాలని, అవసరమైన మందులు నిల్వ ఉంచుకోవాలని, వైద్య సిబ్బందిని అందుబాటులో  ఉంచుతామన్నారు. విక్యూసీ 2లోని వంట గదులలో ఇటీవల తనిఖీలు నిర్వహించానని, అక్కడ మరమ్మత్తులను అధికారులు వాటిని నిర్ణీత గడువులో పూర్తి చేశారని తెలిపారు.


పవిత్రంగా శ్రీవారికి తలనీలాలు సమర్పించే కళ్యాణకట్టలలో భక్తులకు మరింత సౌకర్యవంతంగా కూర్చుని తలనీలాలు సమర్పించేలా చిన్నపాటి బల్లలు ఏర్పాటు చేయాలని గత తనిఖీలలో సూచించారు. దీంతో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ఇనుప కుర్చీలను పరిశీలించి మరింత సౌకర్యవంతంగా  ఉండేలా తయారు చేయించాలని అధికారులకు సూచించారు. అనంతరం హిల్‌ వ్యూ కాటేజీలలోని గదులను పరిశీలించారు. గదులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, అవసరమైన ఎలక్ట్రికల్‌ పనులు చేపట్టాలని, పైకప్పు మరమ్మత్తులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ 2, నందకం అతిధి భవనంలోని మిని కళ్యాణకట్టలు, హిల్‌వ్యూ కాటేజీలలోని గదులలో టిటిడి ఏర్పాటు చేసిన సౌకర్యాలపై భక్తులను అడిగి తెలుసుకున్నారు.  కంపార్ట్‌మెంట్లలో ఉన్న భక్తులు పొందిన యాక్సెస్‌ కార్డుల వినియోగంపై మరింత అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, ఈఈ శ్రీ ప్రసాద్‌, కల్యాణకట్ట డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏవిఎస్‌వో శ్రీ గంగరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply